: ఏపీ కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలు!
ఈ సాయంత్రం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటి విషయానికొస్తే.. కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో స్టీల్ ప్లాంట్ కు భూమి ఇవ్వాలని, 2018 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేబినెట్ తెలిపింది. అనంతపురం పట్టణాభివృద్ధి సంస్థలోకి హిందూపురంను తీసుకురావడం, కాకినాడ- రాజమండ్రి నగరాలతో గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, కాకినాడలో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహాపరిశ్రమల కోసం అన్ని నియోజకవర్గాల్లోను వంద ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ ల నిర్మాణం, దోమలపై దండయాత్రకు కార్యాచరణ, కరవు, భూగర్భ జలమట్టం వంటి అంశాలపై చర్చించారు. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఎనేబుల్ యాక్ట్ సవరణకు, ఎన్జీ రంగా యూనివర్శిటీ పరిధిలోకి ప్రైవేట్ వ్యవసాయ కాలేజీలను తీసుకొస్తూ ఆర్డినెన్స్ కు, ఏపీ రెంట్ కంట్రోల్ బిల్లు -2016 కు కేబినెట్ ఆమోదం లభించింది. ఏపీ కల్చరల్ అండ్ టూరిజం హెరిటేజ్ బోర్డు ఏర్పాటుకు కూడా నిర్ణయించారు. డబుల్ రిజిస్ట్రేషన్ల నివారణకు గాను కొత్త ప్రొవిజన్లు చేర్చేందుకు, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో మెగాఫుడ్ పార్క్ నిర్వాసితులకు ఎకరాకు రూ.7.5 లక్షల పరిహారం చెల్లించాలని, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారి పల్లెలో నటుడు మోహన్ బాబు నిర్మించనున్న వృద్ధాశ్రమం కోసం ఒక ఎకరం యాభై సెంట్ల భూమి కేటాయింపునకు, బ్రహ్మకుమారి శాంతి సరోవరానికి తిరుపతిలో 2.95 ఎకరాలు కేటాయించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం లభించినట్లు సమాచారం.