: ఫ్లాపుల్లో ఉన్నాను.. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల కావడం నాకు చాలా అవసరం: రణ్ బీర్ కపూర్
'ఏ దిల్ హై ముష్కిల్'సినిమా విడుదల కావడం తనకు చాలా అవసరమని ప్రముఖ నటుడు రణ్ బీర్ కపూర్ తెలిపారు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే 'ఎమ్మెన్నెస్' హెచ్చరికల నేపథ్యంలో ధియేటర్ల యజమానులు కూడా పాక్ నటులున్న సినిమాలను తమ థియేటర్లలో విడుదల కానివ్వమని స్పష్టం చేయడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా ప్రకటించిన థియేటర్లు సుమారు 400గా లెక్క తేలాయి. దీంతో, చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసి, భారీ ఓపెనింగ్స్ లాగేయొచ్చని భావించిన సినిమా యూనిట్ కు షాక్ తగిలింది. దీంతో ఓ వీడియో సందేశాన్నిస్తూ దర్శకుడు కరణ్ జొహార్ విడుదలకు సహకరించవలసిందిగా కోరగా.. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న రణ్ బీర్ కపూర్... తాను ఫ్లాపుల్లో ఉండంతో తీవ్ర నిరాశలో ఉన్నానని, దీంతో తాను ఇప్పటికే ఎంతో నష్టపోయానని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క హిట్ తన ఫేట్ మారుస్తుందని, దీంతో ఈ సినిమా విడుదల తనకు చాలా అవసరమని పేర్కొన్నాడు. గత నవంబర్ లో 'తమాషా' సినిమా విడుదల కాగా, ఇన్నాళ్ల విరామం తరువాత ఈ సినిమా వస్తోందని అన్నాడు. ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే... జైలు నుంచి విడుదలైనంత ఉపశమనం తనకు లభిస్తుందని రణ్ బీర్ కపూర్ తెలిపాడు.