: ఢిల్లీ జేఎన్‌యూలో కలకలం... గొడవపడిన విద్యార్థి అదృశ్యం!
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఒక విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. సదరు విద్యార్థి హాస్టల్లో పలువురితో గొడవ పడ్డాడు. అనంతరం కనిపించకుండా పోవడంతో అతడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్సిటీకి చేరుకున్న వారు అక్కడే ఆందోళనకు దిగారు. స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ విద్యార్థి అయిన నజీబ్ అహ్మద్ రెండు వారాల క్రితమే జేఎన్‌యూలో చేరాడు. వచ్చిన కొన్ని రోజులకే తమ కుమారుడు అదృశ్యమయ్యాడని ఆ విద్యార్థి తల్లి ఆవేదనగా చెందుతోంది. తమ కుమారుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియడం లేదని, తన కొడుకును తిరిగి తమకు చూపించాలని అంది. తమ కుమారుడి అదృశ్యం గురించి వినగానే ఉత్తరప్రదేశ్‌లోని బదయూ నుంచి ఆమె ఆందోళన చెందుతూ వర్సిటీకి వచ్చింది. దీనిపై స్పందించిన వామపక్ష కార్యకర్తలు వర్సిటీలోని ఏబీవీపీ కార్యకర్తలతో నజీబ్ గొడవపడ్డాడని మెస్ కమిటీ ఎన్నికల కోసం రాత్రిపూట ప్రచారం జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఏబీవీపీ అభ్యర్థిని నజీబ్ చెంపమీద కొట్టాడని వారు చెప్పారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు అక్కడకు వచ్చి నజీబ్‌ను కొట్టారని ఆరోపిస్తున్నారు. ఏబీవీపీ నాయకులు మాత్రం వారి మాటలను ఖండిస్తున్నారు. వామపక్ష కార్యకర్తలే గొడవలో జోక్యం చేసుకున్నారని, అనంతరం నజీబ్‌ను బాత్రూంలో కొట్టారని ఆరోపిస్తున్నారు. అనంతరం ఆ విద్యార్థిని వార్డెన్ సమక్షంలో బయటకు తీసుకెళ్లారని చెప్పారు.