: చైనా-పాకిస్థాన్ కారిడార్ ఈస్టిండియా కంపెనీ లాంటిది: ప్లానింగ్ కమిషన్ సభ్యుల వ్యాఖ్యలతో ఇరుకునపడ్డ నవాజ్ షరీప్


యూరీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు గడ్డు రోజులు నడుస్తున్నాయి. యూరీ ఉగ్రదాడితో సంబరపడ్డ పాక్ కు సర్జికల్ స్ట్రైక్స్ తో భారత్ దీటైన సమాధానం ఇచ్చింది. తరువాత ఐక్యరాజ్యసమితిలో ఒంటరిని చేసింది. ప్రపంచ దేశాలతో పాక్ ను ఉగ్రదేశంగా ప్రకటించే దిశగా దౌత్యం నెరపింది. బెలూచిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ల ప్రజలకు ధైర్యం కలిగి ఆందోళనలతో రోడ్లెక్కేలా చేసింది. దీంతో ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు ఇలా పాక్ లోని ప్రతి వర్గం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ క్రమంలో, భారత్ కు చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) పై ఆ దేశ చట్టసభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీపీఈసీ ప్రాజెక్టు కారణంగా చైనా మరో ఈస్టిండియా కంపెనీగా మారే ప్రమాదం ఉందని పాకిస్థాన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌ మెంట్ సెనేట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సెనేటర్ తాహిర్ మషాది పేర్కొన్నారు. ఆయన వాదనతో చట్టసభ్యులంతా ఏకీభవిస్తున్నారు. సీపీఈసీ కారణంగా స్థానిక ప్రజలు, ప్రాజెక్టులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆయన పేర్కొన్నారు. దేశప్రయోజనాలను కాపాడలేకపోతే సీపీఈసీ మరో ఈస్టిండియా కంపెనీగా మారుతుందని ఆయన అన్నారు. పాక్-చైనా స్నేహంపై గౌరవం ఉన్నప్పటికీ పాకిస్థాన్ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారంలో పేరుతో భారత్‌ లో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ క్రమంగా భారత్‌ పై ఆధిపత్యం చెలాయించి, దేశాన్ని వశం చేసుకోవడానికి కారణమైందని, చైనా కారిడార్ వల్ల కూడా ఇటువంటి ప్రమాదమే ఉండే అవకాశం ఉందని ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ యూసుఫ్ నదీమ్ ఖోఖార్ పేర్కొన్నారు. ఈ కమిటీలోని కొందరు సభ్యులు ఈ ప్రాజెక్టుపై మాట్లాడుతూ సీపీఈసీ కారణంగా ప్రభుత్వం ప్రజల హక్కులు, ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో భారత్ కు చెక్ పెట్టడం ప్రధాన లక్ష్యంగా భావించిన షరీఫ్...సొంత చట్టసభ్యులే ఎదురుతిరగడంతో ఏం చేయాలో పాలుపోక తికమకపడుతున్నారు. కాగా, 46 బిలియన్ డాలర్లతో చైనా సీపీఈసీ ప్రాెజెక్టును చేపట్టింది.

  • Loading...

More Telugu News