: ఒక్క సీటు కూడా వైసీపీకి పోవడానికి వీల్లేదు... ఇకపై పార్టీ మీదే దృష్టి: చంద్రబాబు
ఇకపై పార్టీపై ఎక్కువ దృష్టి పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రతి రోజూ మూడు గంటలపాటు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తానని చెప్పారు. విజయవాడలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలని, వైసీపీకి ఒక్క సీటు కూడా పోకూడదని, ఈ బాధ్యతను మంత్రులే తీసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి సర్వే చేయిస్తానని, తేడా వస్తే మళ్లీ టికెట్ ఇవ్వనని బాబు గట్టిగా హెచ్చరించారు. ఇసుక వ్యవహారాల్లో పార్టీ నేతలు ఎవరైనా ఉంటే సహించనని, ఎవరైనా ఉంటే వెంటనే తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలు మొదలుకానున్నాయని... ఈలోగా అన్ని నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. జనచైతన్య యాత్రలో భాగంగా మంత్రులంతా 10 రోజులు సొంత నియోజకవర్గంలో, 5 రోజులు జిల్లాలో, 15 రోజులు రాష్ట్రంలో పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు.