: మోదీ 'పాక్ ఉగ్రవాదం' వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా
గోవాలో బ్రిక్స్ సమాఖ్య సదస్సు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. పాకిస్థాన్‌ను మోదీ ఉగ్రవాదానికి మాతృమూర్తిలా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను అమెరికా ఇటు పూర్తిగా సమర్థించకుండా, అటు విమర్శించకుండా స్పందించింది. పాక్ ఉగ్రవాద బాధిత దేశమేనంటూ పేర్కొంది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ మీడియా కార్యదర్శి జోస్ ఎర్నెస్ట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మోదీ ఏ సందర్భంలో అటువంటి వ్యాఖ్య చేశారో తమకు తెలియదని అన్నారు. అయితే, ఉగ్రవాదంపై పాకిస్థాన్ పోరాడాల్సిన బాధ్యత ఎంతో ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అమెరికా కోరుకుంటోందని జోస్ ఎర్నెస్ట్ చెప్పారు. భారత్, పాకిస్థాన్‌లతో తమ దేశానికి విడదీయలేని బంధం ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలపై తాము ఎన్నోసార్లు చర్చించామని తెలిపారు. పాకిస్థాన్ కూడా ఉగ్రవాదానికి బలవుతోందని చెప్పారు. భారత్ తో మంచి సంబంధాలను నెలకొల్పడానికి తమ దేశం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. ఒబామా- మోదీల విధానాలతో అమెరికా-భారత్ ప్రజలు ఎంతో లాభం పొందుతున్నారని వ్యాఖ్యానించారు.