: భారత్‌లోని ఆయిల్ కంపెనీలపై పాకిస్థాన్ గూఢచర్యం... నిఘా వర్గాల హెచ్చరిక
భారతదేశంలోని చమురు సంస్థలపై సమాచారాన్ని సేకరిస్తూ పాకిస్థాన్ చేస్తోన్న కుట్ర బయటపడింది. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఇటీవల పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ కాల్‌ను రహస్యంగా విన్నప్పుడు ఈ విషయం వెల్లడైంది. పాకిస్థాన్ ఆ సంస్థలపై గూఢచర్యం చేస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. భారత్‌లోని ఓ ఆయిల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ నుంచి పాక్ ఓ కీలక అంశాన్ని తెలుసుకుంటున్నట్లు చెప్పింది. ఈ అంశంపై వెంటనే స్పందించి, భద్రతను పెంచాలని చమురు మంత్రిత్వ శాఖకు సూచించింది. భారత్‌కు చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ నిఘా అధికారిగా తనని తాను పరిచయం చేసుకుంటూ పాక్ వ్యక్తి రాజస్థాన్‌లోని హైడ్రోకార్బన్ పైప్‌లైన్ ఎగ్జిక్యూటివ్‌తో ఫోన్‌లో మాట్లాడి పలు అంశాలు చెప్పాలని అన్నాడు. మారుపేర్లతో భారతదేశంలోని అనేక సంస్థల ఎగ్జిక్యూటివ్‌లకు పాక్ వ్యక్తులు ఫోన్లు చేస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఐబీ తెలిపింది. సంస్థల ఎగ్జిక్యూటివ్‌లకు ఈ విషయాన్ని తెలుపుతూ సమాచారం ఇవ్వకూడదని ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఐబీ కోరింది. ఈ అంశాన్ని హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని చమురు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అధికారులను తాము అప్రమత్తం చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.