: ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద భారీ భద్రత కల్పిస్తాం!: ప్రొడ్యూసర్స్ గిల్డ్
బాలీవుడ్ తారలు రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఏ దిల్ హై ముష్కిల్ విడుదలకు కష్టాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్‌జొహార్ తెరకెక్కించిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, పాకిస్థాన్, ఇండియా మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ నటుల సినిమాలను ఆడనివ్వబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. ఈ సినిమాలో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించాడు. ‘ఏ దిల్ హై ముష్కిల్’ మూవీని సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా విడుదల చేయబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మరోవైపు ఈ సినిమా షెడ్యూల్ ప్రకారమే రిలీజ్ అవుతుందని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు ముకేష్ భట్ తెలిపారు. దీనికి కావాల్సిన భద్రతను కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. దీంతో సినిమా విడుదలవుతున్న థియేటర్ల ముందు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ కట్టుబడి ఉంటుందని ముకేష్ భట్ మీడియాకు తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వం ఎలా ముందుకువెళ్లమని చెబితే అలా చేయడానికి తాము సిద్ధమేనని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ విషయంలో గాని, షూటింగ్ జరుగుతున్న సినిమాల విషయంలో గానీ తమకు సర్కారు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రభుత్వం సహకరించకపోతే తాము చేయని నేరానికి తమకు భారీ నష్టాలు వస్తాయని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ముందే పాక్ నటులు సర్కారు అనుమతితోనే దేశంలోకి వచ్చారని ఆయన వివరించారు. ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాకు సెన్సార్ బోర్డు ఇప్పటికే క్లీన్‌చిట్ ఇచ్చిందని ఈ మూవీ విడుదలకు అడ్డంకులు తలెత్తకుండా సర్కారు చూడాలని కోరారు.