: మన దేశ ఆర్మీ మనల్ని తలెత్తుకునేలా చేసింది: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి హోదాలో తొలిసారి హిమాచల్ ప్రదేశ్ లో అడుగుపెట్టిన నరేంద్ర మోదీ.. రాష్ట్రంలోని ‘మండి’లో పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్మించిన మూడు జలవిద్యుదుత్పత్తి కేంద్రాలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. స్వచ్ఛభారత్‌ను విజయవంతం చేసినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీని పరాయి రాష్ట్ర వ్యక్తిగా అక్కడి ప్రజలు భావించరని ఆయన అన్నారు. హిమాచల్ ప్రాంత వాసిగానే ప్రజలు వాజ్‌పేయీని ఆదరిస్తారని ర్కొన్నారు. తాను అక్కడికి రావడంలో ఆలస్యం అయినా, ఆ ప్రాంతంలో పర్యటించడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. అక్కడి ప్రజలు చూపుతున్న ప్రేమకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నానని మోదీ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజల హృదయాలు హిమాలయాలంత మంచితనాన్ని నింపుకొని ఉన్నాయని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ‘దేవ్ భూమి’తో పాటు ‘వీర్ భూమి’ కూడా అని ఆయన అన్నారు. ఇటీవల భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకున్న పరిస్థితులపై మాట్లాడుతూ మన దేశ ఆర్మీ మనల్ని తలెత్తుకునేలా చేసిందని వ్యాఖ్యానించారు. సైనికులు అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించారని అన్నారు. 'వన్ ర్యాంక్, వన్ పింఛన్'పై తాను ఇచ్చిన హామీకి కట్టుబడి, దాన్ని అమలు పరిచినట్లు చెప్పారు. ప్రపంచం మొత్తం భారత ఆర్మీని ప్రశంసిస్తోందని అన్నారు.