: అయోధ్యపై మోదీ తీరు సరికాదు.. ఇటీవల సభలో ‘జై శ్రీరాం’ అంటూ నినదించారు: కరుణానిధి ఆగ్రహం


ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో రామజన్మ భూమి ‘అయోధ్య’ అంశంపై పలువురు రాజకీయ నేతలు వాడీవేడీగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్క‌డ‌ 25 ఎకరాల్లో శ్రీరామునికి సంబంధించిన ఓ మ్యూజియాన్ని నెల‌కొల్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు కేంద్ర సాంస్కృతిక, ప‌ర్యాట‌క‌ శాఖ మంత్రి మహేష్ శర్మ ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు బీజేపీ నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ జాబితాలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా చేరారు. ఎన్నికల దృష్ట్యానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘రామాలయం’ అంశాన్ని తెర‌పైకి తెచ్చార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఆ రాష్ట్రంలో త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలను ఆశించి ఇప్పటి నుంచే బీజేపీ పావులు కదుపుతోందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవల రామ్‌ లీలా మైదానంలో మోదీ చేసిన వ్యాఖ్యల‌ను ఉటంకిస్తూ కరుణానిధి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోదీ ప్రసంగం ప్రారంభించే స‌మ‌యంలో, ముగించే సమయంలో ‘జై శ్రీరాం’ అని నిన‌దించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్య‌లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయ‌ని అన్నారు. అయోధ్యలో రామాయణ మ్యూజియం కోసం 25 ఎకరాల భూమిని కేంద్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ మ్యూజియం వివాదాస్ప‌ద‌మైన‌ రామజన్మ భూమి, మసీదులు ఉన్న ప్రాంతానికి 15 కిలో మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌జ‌లను మతప‌రంగా రెచ్చ‌గొట్టి ఓట్లను పొందేందుకే ఈ ప‌ని చేప‌డుతున్నార‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News