: భువనేశ్వర్ కార్పొరేట్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 23మంది సజీవ దహనం.. వందమందికిపైగా తీవ్రగాయాలు.. ప్రధాని దిగ్ర్భాంతి


ఒడిశాలో సోమవారం రాత్రి ఘోరం జరిగింది. భువనేశ్వర్‌లోని కార్పొరేట్ ఆస్పత్రి ఎస్‌యూఎంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది సజీవ దహనమయ్యారు. వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను చుట్టుముట్టడంతో వారు సజీవంగా కాలి బూడిదయ్యారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే వందమంది అగ్నిమాపక సిబ్బంది ఏడు శకటాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. ఆస్పత్రిలోని ఇతర వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. బ్రోంటో స్కైలిఫ్ట్‌లను ఉపయోగించి పై అంతస్తుల్లో ద్వారాలు, కిటికీలు బద్దలుగొట్టి అక్కడ చిక్కుకుపోయిన రోగులను బయటకు తీసుకొచ్చారు. రాజధాని భువనేశ్వర్‌లోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన ఎస్‌యూఎంలోని డయాలసిస్ వార్డులో తొలుత మంటలు చెలరేగాయి. అవి వెంటనే ఐసీయూకు వ్యాపించాయి. భయాందోళనకు గురైన రోగులు వెంటనే ఐసీయూ డోర్లు మూసేశారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 500 మంది వరకు ఇన్‌పేషెంట్లు ఉన్నట్టు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే డయాలసిస్, ఐసీయూ వార్డుల నుంచి 40 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంపై ఒడిశా ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డాను ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒడిశా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News