: ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్ లో పాక్ చిత్రాలకు నో ఛాన్స్?
భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పలు పరిణామాలకు దారి తీస్తోంది. భారత్ లో పాకిస్థాన్ కళాకారులు ఉండటానికి వీలు లేదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గతంలో హెచ్చరించిన విషయం విదితమే. త్వరలో ముంబయిలో ఫిల్మ్ ఫెస్టివల్ జరగనున్న నేపథ్యంలో ‘సంఘర్ష్’ అనే మరో సంస్థ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్ లో పాక్ చిత్రాలను దూరంగా పెట్టాలని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముంబయి అకాడమీ ఆఫ్ ద మూవీంగ్ ఇమేజ్ (ఎంఏఎంఐ) ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ముంబయి ఫిల్మ్ ఫెస్టివల్ 18వ ఎడిషన్ ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు జరగనుంది. సుమారు 54 దేశాలకు చెందిన 180 చిత్రాలను ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా పాకిస్థాన్ చిత్రాలను ప్రదర్శించడానికి వీలు లేదని ‘సంఘర్ష్’ అనే సంస్థ ప్రతినిధులు హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ చిత్రాలను ప్రదర్శించమంటే భారతీయుల జాతీయ భావాలతో ఆటాడుకోవడమేనని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఎంఏఎంఐ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.