: 1971 యుద్ధాన్ని కాంగ్రెస్ వాడుకుంది.. ఇప్పుడు మేము సర్జికల్ స్ట్రయిక్స్‌ని వాడుకుంటే తప్పేంటి?: సుబ్రహ్మణ్య స్వామి
ఇటీవల భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి పీవోకేలోని ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌ని బీజేపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్న ప్రతిపక్షాల విమర్శలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ... గతంలో 1971 యుద్ధాన్ని కాంగ్రెస్ వాడుకుందని, అలాంటప్పుడు తాము సర్జికల్ స్ట్రయిక్స్‌ను వాడుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాదు, రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కూడా సర్జికల్ స్ట్రయిక్స్‌ను తాము ప్రస్తావిస్తామని చెప్పారు. కేవలం అభివృద్ధి అనే విషయంపైనే ప్రచారం చేసుకుని ఏ పార్టీ కూడా ఎన్నికల్లో విజయం సాధించలేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. గతంలో కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు ఎంతో అభివృద్ధి చేసినా ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పొందిందని ఆయన చెప్పారు. 2004లో అటల్ ప్రభుత్వం తాము చేసిన అభివృద్ధినే నమ్ముకుందని కానీ, ఆ ఏడాది బీజేపీ పరాజయం పాలయిందని చెప్పారు. అయోధ్యలో రామమందిరంపై తమ పార్టీ మంచి నిర్ణయంతో ముందుకెళుతోందని, ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే యూపీ ఎలక్షన్స్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, జైట్లీ తీరు మాత్రం అసంతృప్తిగా ఉందని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల అంశంపై ఆయన మాట్లాడుతూ... ఆదాయపన్ను శాఖను మూసేయాలని అన్నారు. అనంతరం అందులోని అధికారులకు రహదారులు, భవనాల ప్రాజెక్టుల్లో బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన సూచించారు. జైట్లీతో ఎలా వ్యవహరించాలనే విషయం ప్రధానమంత్రి మోదీకి మాత్రమే తెలుసని ఆయన అన్నారు.