: 23న ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష.. పోస్టర్ విడుదల చేసిన ప్రొ.కోదండరాం
ప్రజలు అనుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగడం లేదని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో వర్షాలు అధికంగా పడడంతో ఇక రైతులకు సమస్యలుండవని ప్రభుత్వ నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలను తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం, ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసం ఈ నెల 23న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. నకిలీ విత్తనాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అనంతరం కోదండరాం తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న ఆందోళనపై చర్చించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.