: రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫైతో ఆ వెబ్ సైట్లను తెగ చూస్తున్నారట!


దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన తరువాత దాన్ని వాడుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అత్యధికంగా వేటిని చూస్తున్నారో తెలుసా? రైల్వే స్టేషన్లలోని వైఫైని వాడుకుంటూ పోర్న్ సైట్లను తెగ వెతికేస్తూ, వాటి నుంచి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నారు. ఈ విషయంలో పాట్నా రైల్వే స్టేషన్ ముందు నిలువగా, ఆపై జైపూర్, బెంగళూరు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లు నిలిచాయి. ప్రయాణికులు ఎక్కువగా అశ్లీల సైట్లను చూస్తున్నారని వైఫై సేవలందిస్తున్న రైల్ టెల్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. వివిధ రకాల యాప్ లు, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల డౌన్ లోడ్ కోసం కూడా వైఫైని వాడుతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో ఓక్కో యూజర్ కు 1 జీబీ డేటాను ఉచితంగా ఇస్తుండగా, భవిష్యత్తులో దీన్ని 10 జీబీకి పెంచే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కేవలం ఇంటర్నెట్ కోసమే రైల్వే స్టేషన్లకు వస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోందని తెలుస్తోంది. దీని వల్ల వాస్తవ ప్రయాణికులకు నెట్ స్పీడ్ తగ్గిపోతోందన్న ఆరోపణలూ ఉన్నాయి. కాగా, రైల్ టెల్ ఏపీలోని విశాఖ సహా 23 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లోగా ఈ సంఖ్యను 100కు పెంచుతామని, ఆపై మూడేళ్లలో 400 స్టేషన్లలో తమ వైఫై అందుతుందని రైల్ టెల్ స్పష్టం చేసింది. గూగుల్ తో కలసి వైఫై రూటర్లను ఏర్పాటు చేయడం ద్వారా రైల్ టెల్ ఈ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News