: తన మతిమరుపుతో ధోనీ వన్డే కెరీర్ పై ట్వీట్ చేసి నవ్వులు పూయించిన బ్రెండన్ టేలర్
బ్రెండన్ టేలర్... జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గా, పలుమార్లు ఇండియాకు వచ్చి అలరించిన ఆటగాడిగా భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే. ఇక తన కుటుంబ అవసరాల నిమిత్తమంటూ 29వ ఏటనే ఆటకు విరామం పలికిన టేలర్, ఆదివారం నాడు చేసిన ఓ ట్వీట్ నవ్వులు పూయించింది. ధోనీ టెస్టుల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నిన్న న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో ధోనీ ఆడుతున్న సమయంలో, ఆ మ్యాచ్ ని టెస్టు మ్యాచ్ గా అనుకున్నాడేమో, "ధోనీ టెస్టుల నుంచి వైదొలగాడని నేను అనుకున్నాను" అని ట్వీట్ చేశాడు. 'ఇంకా ధోనీ ఆడుతున్నాడు. ఇదే అతనికి ఆఖరి టెస్టా?' అన్న అర్థం వచ్చేలా మరో ట్వీట్ పెట్టాడు. తిరిగి తప్పు తెలుసుకుని "నా మైండ్ పోయింది" (లూజింగ్ మై మైండ్) అని క్షమాపణలు చెప్పాడు. టేలర్ తొలి ట్వీట్ అర్థం కాక, ఎంతో మంది అతన్ని ప్రశ్నలతో ముంచెత్తారు. చివరికి "నేను నా కుటుంబంతో కలసి ఓ బీచ్ లో ఉన్నాను. క్రిక్ ఇన్ఫోలో ధోనీ ఆడుతున్నాడని చూశాను. అది వన్డే అని తెలుసుకోలేకపోయాను. మరో టెస్టును ఆడుతున్నాడని భావించాను" అని వివరణ ఇచ్చి నెటిజన్ల మధ్య నవ్వులు పూయించాడు.