: తన భార్యతో అక్రమ సంబంధముందని తండ్రినే హత్య చేయించిన కొడుకు... చిత్తూరు జిల్లాలో సంచలనం
కూతురిలా చూసుకోవాల్సిన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ కొడుకు, తన కన్నతండ్రినే కిరాయి హంతకులను పెట్టి హత్య చేయించిన ఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉగిని గ్రామానికి చెందిన శ్రీనివాసప్ప కుమారుడు నరసింహులు వికలాంగుడు. ఇతనికి ఇటీవలే వివాహమైంది. ఇంటికి వచ్చిన తన భార్యతో తండ్రి అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం నరసింహులుకు వచ్చి అది పెనుభూతమైంది. అదే గ్రామానికి చెందిన గఫార్, గౌస్ లతో మాట్లాడి, తన తండ్రిని హత్య చేయాలని పథకం వేశాడు. ఆపై నిందితులు శ్రీనివాసప్పకు పూటుగా మద్యం తాగించి, మామిడి తోటల్లోకి తీసుకువెళ్లి హత్య చేసి అక్కడే పూడ్చి పెట్టారు. ఆపై ఏమీ ఎరగనట్టు నరసింహులు తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూడా. విచారణ ప్రారంభించిన పోలీసులకు నరసింహులు చెబుతున్న పొంతన లేని సమాధానాలతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం ఒప్పుకున్నాడు. ఆపై హత్యకు సహకరించిన నిందితులూ లొంగిపోయారని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.