: చరిత్ర ఎవరినీ క్షమించదు: ములాయంకు వార్నింగ్ ఇచ్చిన అఖిలేష్ టీమ్
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ యూపీలో అధికార సమాజ్ వాదీ పార్టీ లుకలుకలు మరింతగా బహిర్గతమవుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తరువాతనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెబుతూ, సొంత కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు పార్టీ సుప్రీమ్ ములాయం సింగ్ యాదవ్ ఝలక్ ఇవ్వగా, తాజాగా అఖిలేష్ వర్గం ములాయంకు ఓ లేఖ రాస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రూరులుగా మిగలవద్దని, భవిష్యత్తులో క్షమించలేని తప్పు చేయవద్దని, చరిత్ర ఎవరినీ క్షమించబోదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆదివారం నాడు అందిన ఈ లేఖలో, 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలవలేకుంటే, ఓటమి బాధ్యత ములాయం, ఆయన సోదరుడు రాంగోపాల్ యాదవ్ లదేనని హెచ్చరించింది. కుమారుడు అఖిలేష్, సోదరుడు రాంగోపాల్ మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయేలా ములాయం చర్యలు తీసుకుంటున్న వేళ, పార్టీలోని విభేదాలు, కుటుంబ రాజకీయాలు వెలుగులోకి వస్తుండటం ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక తమ కుటుంబంలో ఎలాంటి గొడవలూ లేవని, అందరమూ కలసికట్టుగా ఎన్నికలను ఎదుర్కోనున్నామని అటు అఖిలేష్, ఇటు రాంగోపాల్ లు వ్యాఖ్యానించడం గమనార్హం.