: తొలేళ్ల ఉత్సవంలో ఆడపడుచు దేవతకు పుట్టింటి వస్త్రాలు సమర్పించిన అశోక్ గజపతి రాజు
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం విజయనగరంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచే విజయనగరంలో కోలాహలం నెలకొంది. ఆలయ ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తమ ఆడపడుచుకు పుట్టింటి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలేళ్ల ఉత్సవం అంటే తొలి ఏరు ఉత్సవమన్నమాట. పంటలు సుభిక్షంగా పండాలని కోరుకుంటూ పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో తొలి రోజు తొలి ఏరు (నాగలి) ఉత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా ఆలయపూజారి రైతులకు విత్తనాలు పంపిణీ చేసేవారు. దీంతో రైతులంతా తొలిఏరు (నాగలి) కట్టుకుని పోలాలకు పయనమయ్యేవారు. దీంతో ఇది తొలిఏళ్ల ఉత్సవంగా, కాల క్రమంలో తొలేళ్ల ఉత్సవంగా మారింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి తాళ్ల పూడి భాస్కరరావు విత్తనాలు పంపిణీ చేయనున్నారు. వాటిని దక్కించుకుని పొలంలో చల్లితే దిగుబడి అధికంగా వస్తుందని ఉత్తరాంధ్రుల నమ్మకం. అలాగే పైడితల్లి అమ్మవారు కలలో కనిపించి చెప్పే సిరిమాను గురించి కూడా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. సిరిమానోత్సవాన్ని విజయనగరం వాసులు ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర పండుగగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం బాగా ఫేమస్.