: ఆధార్ కార్డుతో ఏం పొందినా ఏడేళ్లు రికార్డుల్లో ఉంటుంది!
వివిధ సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఆధార్ అనుసంధానిత ప్రయోజనాలు పొందుతున్న లబ్దిదారుల పూర్తి సమాచారాన్ని ఏడేళ్ల పాటు రికార్డుల్లో ఉంచాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరికి ఏ మేరకు ఎంత లబ్ది చేకూరిందన్న విషయాన్ని డేటాబేస్ లో నిక్షిప్తం చేయాలని, యూఐడీఏఐ (యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా) ఈ రికార్డులను దాస్తుందని తెలుస్తోంది. యూఐడీఏఐ ప్రతి భారతీయుడికీ 12 అంకెల సంఖ్యను ఆధార్ పేరిట కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అన్ని పథకాలకూ ఆధార్ కార్డు ఇప్పటికే అనుసంధానమైన సంగతి తెలిసిందే. రేషన్ నుంచి గ్యాస్ సబ్సిడీ వరకూ ప్రజలు పొందిన లబ్దినంతా రెండేళ్ల పాటు ఆన్ లైన్లో, ఆపై ఐదేళ్ల పాటు ఆఫ్ లైన్లో స్టోర్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఏవైనా నగదు బట్వాడా లావాదేవీల్లో వివాదాలు వస్తే, వాటి పరిష్కారం కోసమే రికార్డులు దాయాలని నిర్ణయించినట్టు యూఐడీఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏబీపీ పాండే వెల్లడించారు. కాగా, ఇండియాలో 50 లక్షల ఆధార్ సంఖ్యలు వివిధ పథకాలకు అనుసంధానమై ఉన్నట్టు యూఐడీఏఐ వర్గాలు వెల్లడించాయి.