: ప్రజలకు ఎందుకు నిజాలు చెప్పలేకపోతున్నారు?: ప్రభుత్వాన్ని నిలదీసిన ఉండవల్లి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ టీడీపీ ప్రభుత్వంపై ఈ రోజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు నిజాలు ఎందుకు చెప్పలేకపోతోందని అడిగారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాను ఎవరు డిమాండ్ చేస్తే వారిపై టీడీపీ నేతలు దేశద్రోహి ముద్ర ఎందుకు వేస్తున్నారని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రత్యేకహోదాపై ప్రభుత్వాన్ని నిలదీస్తే... ప్రతి ఒక్కరూ ఆయన లక్ష కోట్ల రూపాయలు దోచేశాడని అంటున్నారని, ఆ లెక్కలు తనకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఆయనపై నమోదైన ఆర్థిక నేరాల కేసుల్లో కేవలం 13,000 కోట్ల రూపాయలపై అభియోగాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వాటికి సరిపడా జైలు శిక్షను జగన్ ఇప్పటికే అనుభవించేశాడని ఆయన అన్నారు. తనకు తెలిసి 16 నెలలపాటు జైల్లో ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన చెప్పారు. లేదు, జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని టీడీపీ నేతలు పదేపదే ఆరోపించేట్టయితే... ఆ లక్ష కోట్లు ఏ ఏ కేసుల్లో ఎంతెంత దోచుకున్నాడు? ఏ కేసులో కోర్టు ఎంత సీజ్ చేసింది? అందులో అక్రమ సంపాదన ఎంత? ఈ మొత్తాన్ని ఎలా దోచుకున్నాడు? అన్న వివరాలను ప్రభుత్వమే ప్రజలకు చెప్పాలని ఆయన డిమండ్ చేశారు. చంద్రబాబు కోర్టులను మ్యానిప్యులేట్ చేయగలడని గతంలో తెలంగాణ ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తి నేరుగా లైవ్ లో చెప్పారని ఆయన గుర్తు చేశారు. న్యాయవ్యవస్థను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబుపై న్యాయపోరాటానికి తాను మూడు పిటిషన్లు దాఖలు చేశానని అన్నారు. ఈ మూడు పిటిషన్లు కోర్టును రీచ్ అవ్వాలని, అంత వరకు తాను బతికే ఉండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేశారు. ఎలక్షన్ పాలిటిక్స్ లో ఉండేందుకు తన వయసు సహకరించడం లేదని ఆయన తెలిపారు. ఎలక్షన్ పాలిటిక్స్ లో లేనప్పుడు రాజకీయాల్లో ఉండడం సరికాదని భావించి రాజకీయాల నుంచి తప్పుకున్నానని ఆయన చెప్పారు.