: చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఎంపిక మే 4న
జూన్ లో ఇంగ్లండ్ వేదికగా జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును వచ్చే శనివారం ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఈ టోర్నీ కోసం 30 మందితో ప్రాబబుల్స్ జాబితా ప్రకటించిన బీసీసీఐ తుది జట్టును ప్రకటించేందుకు కసరత్తులు ప్రారంభించింది. కాగా, ఏప్రిల్ 6 న వెల్లడించిన ప్రాబబుల్స్ జాబితాలో సీనియర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ లకు మొండిచేయి ఎదురైన సంగతి తెలిసిందే. అయితే, ఈ జాబితాలో లేకున్నా ఆటగాళ్ళను ఎంపిక చేయవచ్చని ఐసీసీ నియమావళి చెబుతున్న నేపథ్యంలో వన్డే జట్టులో పునరాగమనానికి వీరిద్దరూ ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈ టోర్నీ జూన్ 6 నుంచి 23 వరకు జరగనుంది. జూన్ 6న భారత్ తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జూన్ 15న బర్మింగ్ హామ్ వేదికపై అమీతుమీ తేల్చుకోనుంది. టెస్టు క్రికెట్ ఆడే ఎనిమిది అగ్రశ్రేణి జట్లు ఈ వన్డే టోర్నీలో తలపడతాయి. బి గ్రూప్ లో భారత్ తో పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్ ఉన్నాయి. ఎ గ్రూప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి.