: నీళ్లు ఇవ్వండంటూ... తమిళనాట ఆందోళన.. స్తంభించిన రైళ్లు!
కర్ణాటక నుంచి తక్షణమే కావేరీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, డీఎంకే ఆధ్వర్యంలో 48 గంటల రైల్ రోకో తమిళనాడులో ప్రారంభం కావడంతో, ఈ ఉదయం పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డీఎంకే విపక్ష నేత స్టాలిన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో పట్టాలపైకి చేరి రైళ్లను అడ్డుకుంటున్నారు. దాదాపు 200 వరకూ రైల్వే స్టేషన్లను డీఎంకే కార్యకర్తలు ముట్టడించినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా వాటిని ధిక్కరిస్తున్న కర్ణాటక ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించిన స్టాలిన్, వెంటనే నీటిని విడుదల చేసి తమిళుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. డీఎంకే పిలుపు మేరకు కాంగ్రెస్, తమిళ మనీల కాంగ్రెస్, డీఎండీకే సహా సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే తదితర పార్టీలు కూడా సమ్మెకు మద్దతు పలికాయి. దూరప్రాంత రైళ్లకు ఆటంకాలు కలుగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతుండటంతో తమిళనాట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.