: రూ. 5 లక్షల లోపు కారు కొనాలా?... టాప్-5 కార్లివి!


ఈ పండగల సీజన్ లో కొత్త కారు కొనాలని భావిస్తున్నారా? అది కూడా ఎంట్రీ లెవల్ లో రూ. 5 లక్షల బడ్జెట్ లో కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? వాహన రంగంలోని నిపుణుల సూచనల మేరకు రూ. 5 లక్షల్లోపు లభించే టాప్-5 కార్ల వివరాలివి. ఇవే కార్లకు మరో రెండు లక్షల రూపాయల వరకూ పెట్టుకోగలిగితే ప్రీమియం ఫీచర్లూ లభిస్తాయండోయ్. 1. ఫోర్డ్ ఫిగో: హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో బెస్ట్ వాల్యూ ఇచ్చే కారు ఇదేనని నిపుణుల అభిప్రాయం. క్వాలిటీతో కూడిన ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీట్లు, ఆప్ లింక్ తో సింక్ అవడం ద్వారా కార్ కనెక్టివ్ సిస్టమ్ దీనికి అదనపు ఆకర్షణ. 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్లలో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో లభిస్తుంది. హైఎండ్ ను ఎంచుకుంటే, ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ సౌకర్యాలు దగ్గరవుతాయి. ధర రూ. 4.53 లక్షల నుంచి రూ. 7.27 లక్షల వరకూ ఉంటుంది. 2. టాటా టియాగో: టాటా హౌస్ లో ఇండిగోను ఎంత మాత్రమూ గుర్తు చేయకుండా రూపొందిన హ్యాచ్ బ్యాక్ కారిది. పెట్రోలు, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ సాయంతో టర్న్ బై టర్న్ నావిగేయన్ యాప్ ఇన్ బిల్ట్ గా లభిస్తుంది. మల్టీ డ్రైవ్ మోడ్ ఇందులో ప్రత్యేకత. ధర రూ. 3.20 లక్షల నుంచి రూ. 5,.67 లక్షల వరకూ ఉంటుంది. 3. మారుతి సుజుకి సెలేరియో: ఈ సెగ్మెంట్ లో ఆటోమేటెడ్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్ యూనిట్ తో లభించే కారు ఇదే. లీటరు పెట్రోల్ తో 27.62 కిలోమీటర్ల దూరం వెళుతుంది. మోస్ట్ ఫ్యూయల్ ఎఫీషియంట్ మోడల్స్ లో ఇదొకటి. 800 సీసీ డీడీఐఎస్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఎంచుకునే వేరియంట్ ను బట్టి ధర రూ. 4.03 లక్షల నుంచి రూ. 5.11 లక్షల వరకూ ఉంటుంది. 4. రెనాల్ట్ క్విడ్: అమ్మకాల్లో శరవేగంగా దూసుకుపోతున్న కారిది. 2016 సంవత్సరానికి కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకుంది. గ్రౌండ్ క్లియరెన్స్ లో సెకండ్ బెస్ట్ కూడా ఇదే. టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్ మెంట్ సిస్టమ్, 800 సీసీ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో లభిస్తుంది. దీని ధర రూ. 2.64 లక్షల నుంచి రూ. 3.95 లక్షల వరకూ ఉంటుంది. 5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10: మార్కెట్లోకి వచ్చి ఏళ్లు గడిచినా, మిగతా కార్లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకెళుతున్న కారిది. కీ లేకుండా స్టార్ట్, స్టాప్ బటన్, పార్కింగ్ సెన్సార్ వంటి స్మార్ట్ ఫీచర్లున్నాయి. 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్, 1.1 లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఇంజన్ లతో లభిస్తుంది. డీజిల్ వేరియంట్ లో 5 స్పీడ్ మాన్యువల్, పెట్రోల్ వర్షన్ లో 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ సదుపాయం ఉంది. దీని ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 4.91 లక్షల నుంచి రూ. 7.02 లక్షల వరకూ ఉంటుంది. (అన్ని ధరలూ ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ)

  • Loading...

More Telugu News