: సైనికుల దుస్తుల్లో వచ్చి, తుపాకులు దోచుకెళ్లిన ముష్కరులు
జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గత రాత్రి టీవీ టవర్ వద్ద కాపలా కాస్తున్న పోలీసులపై దాడికి దిగారు. సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పోలీసులపై దాడి చేసి, వారి నుంచి ఐదు తుపాకులను లాక్కెళ్లారని సైన్యాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదని తెలిపారు. ఆయుధాలు తీసుకున్న ముష్కరులు ఆ వెంటనే చీకట్లో కలిసిపోయారని వివరించారు. విషయం తెలుసుకున్న భద్రతాదళాలు వారి కోసం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. అనంత్ నాగ్ ప్రాంతంలోని అన్ని రహదారులను దిగ్బంధించి, చెక్ పోస్టుల వద్ద పోలీసులు, సైన్యం జల్లెడ పడుతున్నాయి.