: హైదరాబాదులో చలి మొదలైంది: వాతావరణ శాఖ


హైదరాబాదులో చలి మొదలైందని, గత రెండు మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సీజన్ లోనే అత్యల్ప ఉష్ణోగ్రత 17.8 డిగ్రీల సెల్సియస్ శనివారం రాత్రి నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 డిగ్రీలు తక్కువని వాతావరణ శాఖ పేర్కొంది. గాలిలో తేమ శాతం పడిపోయిందని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. ప్రస్తుతం గాలిలో తేమ 56 శాతం ఉందని, ఇది సాధారణంతో పోలిస్తే 15 శాతం తక్కువని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆకాశం ప్రశాంతంగా ఉండడంతో భూమి నుంచి వెలువడే వేడి నేరుగా పైకి వెళ్లిపోతోందని, దీని కారణంగా రాత్రి పూట త్వరగా చల్లబడుతోందని ఆయన వెల్లడించారు. ఆకాశంలో మబ్బులు ఉండి ఉంటే భూమి నుంచి పైకెళ్లిన వేడి తిరిగి భూమిని చేరి ఉండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయని ఆయన వివరించారు. దీంతో సాధారణం కంటే మూడు లేదా నాలుగు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News