: మోదీకి వ్యతిరేకంగా, అనుకూలంగా దర్శకుల ట్వీట్ల యుద్ధం
బాలీవుడ్ లో మరోవివాదం రాజుకుంటోంది. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం పాక్ నటులపై నిషేధం విధించడంతో బాలీవుడ్ లో వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, మాధుర్ భండార్కర్ మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. కరణ్ జోహర్ నిర్మించిన 'యే దిల్ హై ముష్కిల్'లో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఉన్నాడన్న కారణంతో ఆ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించడాన్ని తప్పుబట్టిన అనురాగ్ కశ్యప్ 'నరేంద్ర మోదీ సార్, మీరు పాకిస్థాన్ కు వెళ్లి ఆ దేశ ప్రధానిని కలిసినందుకు ఇప్పటివరకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదు. గతేడాది డిసెంబర్ లో మీరు అకస్మాత్తుగా పాక్ కు వెళ్లారు. అదే సమయంలో కరణ్ జోహార్ 'యే దిల్ హై ముష్కిల్' సినిమాను ప్రారంభించాడు. ఇప్పుడు పాక్ నటుడున్నాడన్న కారణంతో ఆ సినిమాపై నిషేధం అంటున్నారు' అని కశ్యప్ ట్వీట్ చేశాడు. దీనిపై మాధుర్ భండార్కర్ మండిపడ్డారు. అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పాక్ సినీ నటులపై నిషేధం విధించాలంటూ ప్రధాని మోదీ కానీ, బీజేపీ కానీ డిమాండ్ చేయలేదని, ప్రతి దానికి ప్రధానిని విమర్శించడం ట్రెండ్ గా మారిందని ఆయన మండిపడ్డారు.