: నవాజ్ షరీఫ్ కు వార్నింగ్ బెల్స్... ఐదురోజుల గడువిచ్చిన పాక్ సైన్యం!


పాకిస్థాన్ లోని నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వార్నింగ్ బెల్స్ మోగాయి. పాక్ సైనిక సమావేశం జరుగగా, ప్రధాని నవాజ్ షరీఫ్ ను, అతని మంత్రివర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సైన్యాధికారులు టైమ్ బాంబును పేల్చారు. పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు స్వయంగా చెప్పినట్టు 'డాన్' పత్రికలో ప్రత్యేక కథనం రావడాన్ని సీరియస్ గా తీసుకున్న సైన్యం, ఇది తప్పుడు వార్తని అంటూనే, ఈ సమాచారాన్ని ఇచ్చిందెవరో ఐదు రోజుల్లోగా గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని షరీఫ్ ను హెచ్చరించింది. ఐదు రోజుల్లో వారెవరో బయట పెట్టకుంటే, విషయాన్ని తామే స్వయంగా విచారించి నిగ్గు తేలుస్తామని చెప్పింది. డాన్ జర్నలిస్టు సిరిల్ అల్ మైదాకు సమాచారం ఇచ్చింది ఎవరో తేల్చాల్సిన బాధ్యత షరీఫ్ సర్కారుదేనని స్పష్టం చేస్తూ, ఈ విషయంలో తదుపరి పరిణామాలకు షరీఫ్ దే బాధ్యతని చెప్పింది. కాగా, అక్టోబర్ 3 నాడు జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల పూర్తి వివరాలను ఉటంకిస్తూ, డాన్ పత్రికలో సిరిల్ రాసిన వార్త పాక్ లో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఆపై సిరిల్ పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కదలగా, దేశవ్యాప్తంగా మీడియా ఏకతాటిపై నిలిచింది. డాన్ పత్రిక సంపాదకుడు స్వయంగా వ్యాసం రాస్తూ, ఈ సమావేశంలోని వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి, వాస్తవాలు తెలుసుకున్నాకే ప్రచురించామని చెబుతూ, తమ జర్నలిస్టుకు బాసటగా నిలిచారు. ఈ విషయంలో చేయగలిగిందేమీ లేకపోవడంతో సమాచారాన్ని ఎవరు సిరిల్ కు చేరవేశారన్న విషయాన్ని తెలుసుకోవాలని సైన్యాధికారులు గట్టి పట్టుదలతో ఉన్నారు.

  • Loading...

More Telugu News