: పదే పదే 'హిందువులు.. హిందువులు' అని ఆపై నాలుక్కరుచుకుని 'ఇండియా' అన్న ట్రంప్!
అధ్యక్ష ఎన్నికలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో సాధ్యమైనంత ఎక్కువ మంది విదేశీయులకు దగ్గర కావాలన్న ఉద్దేశంతో కమ్యూనిటీ ఆధారిత సభలు, సమావేశాలకు అధికంగా హాజరవుతున్న రిపబ్లికన్ తరఫు అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ప్రవాస భారతీయులతో సమావేశమైన వేళ, పదే పదే 'హిందువులు' అన్న పదం వాడుతూ, చివరకు తప్పు తెలుసుకుని 'ఇండియా' అని అభివర్ణించారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, "హిందువులంటే నా కెంతో గౌరవం ఉంది. చాలా మంది హిందువులు నాకు స్నేహితులుగా ఉన్నారు. వారంతా గొప్పవారు. ఔత్సాహికులు" అని చెబుతూ, ఆపై తప్పు తెలుసుకుని, "నిజాయతీగా చెప్పాలంటే, ఇండియా అంటే నాకు గౌరవం. ఇండియన్స్ అంటే ప్రేమ. నాకు ఇండియాలో కంపెనీలున్నాయి. అక్కడ ఉద్యోగుల సంఖ్యా పెరుగుతోంది. ఇండియా ఓ గొప్ప దేశం" అని అన్నారు. ఆపై ఇండియా, పాక్ మధ్య వైరాన్ని ప్రస్తావిస్తూ, ఇటీవల జరిగిన యూరీ దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్యా తీవ్రమైన విభేదాలున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు తన వంతు సాయం చేస్తానని చెప్పారు. కాగా, ఇటీవలి ఓ సర్వేలో ప్రవాస భారతీయుల్లో కేవలం 7 శాతం మంది మాత్రమే ట్రంప్ కు మద్దతిస్తున్నట్టు వెల్లడైంది. హిల్లరీ వెంట దాదాపు 70 శాతం మంది ఎన్నారైలు నడుస్తున్నారు.