: ఇక మరింత చౌక... పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఇన్సులిన్, హెపటైటిస్ బీ వ్యాక్సిన్
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియాల్ టెక్నాలజీ (ఐఎం టెక్) శాస్త్రవేత్తలు ఇండియాలో తొలిసారిగా ప్రొటీన్ ఆధారిత ఇన్సులిన్ తో పాటు హెపటైటిస్ బీ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఈ ఔషధాల ధరలు మూడు నుంచి నాలుగో వంతు మేరకు తగ్గనున్నాయి. ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులకు, హెపటైటిస్ బీ బాధితులకు వరమేనని వైద్య నిపుణులు వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఇన్సులిన్, స్టెరిప్టోకినేస్, హెపటైటిస్ బీ వ్యాక్సిన్ లను ఇండియా అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. భారత బయోటెక్ కంపెనీలు విదేశీ సంస్థలకు డబ్బిచ్చి, ఈ ఔషధాల ఫార్ములాతో ఔషధాలను తయారు చేస్తూ వచ్చాయని ఐఎం టెక్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జగ్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాము అభివృద్ధి చేసిన ఔషధాలు భారతీయులకు ఎంతో ఉపకరించనున్నాయని అన్నారు. ప్రస్తుతం హెపటైటిస్ బీ వాక్సిన్ 0.5 ఎంఎల్ రూ. 45 నుంచి రూ. 250 మధ్య ఉండగా, ఇన్సులిన్ ఇంజక్షన్ రూ. 140 నుంచి రూ. 325 మధ్య ఉండగా, కొత్త ఔషధాలు మార్కెట్లోకి వస్తే, వీటి ధరలన్నీ రూ. 20 నుంచి రూ. 100 మధ్యే లభిస్తాయని తెలుస్తోంది.