: 1000 డాలర్లు వసూలు చేస్తే, రూ. 5 వేలు ఇన్సెంటివ్... కాల్ సెంటర్ స్కామ్ లో డార్క్ సైడ్!


ముంబై మీరా రోడ్డులో కాల్ సెంటర్ ను తెరచి, అమెరికన్లను టార్గెట్ చేసుకుని దాదాపు రూ. 500 కోట్లను నొక్కేసిన కుంభకోణంలో ఉద్యోగులు తాను చెప్పినట్టు చేయడానికి భారీగా పారితోషికాలను సూత్రధారి షగ్గీ అందించినట్టు తెలిసింది. అరెస్టయిన కాల్ సెంటర్ 'ఉత్తమ ఉద్యోగి' జిగ్నేష్ షా పోలీసులకు వివరించిన సమాచారం ప్రకారం, తొలుత ఓ అమెరికన్ ను పట్టి ఎంతో కొంత బేరం నడిపిన ఉద్యోగికి డాలర్ కు రూపాయి, ఆ తరువాత అతన్నుంచి ఆ డబ్బును రాబట్టిన ఉద్యోగికి డాలర్ కు రెండు రూపాయలు ప్రోత్సాహకంగా ఇచ్చేవాడట. ఆపై ఇది సరిపోదని భావించిన షగ్గీ, కాలర్ కు రూ. 2, డీల్ క్లోజర్ కు రూ. 3 ఇన్సెంటివ్ గా ఇచ్చాడని, తాను లక్షలాది రూపాయలు ఇలా సంపాదించానని జిగ్నేష్ వివరించాడు. టార్గెట్ చేసిన అమెరికన్ నుంచి 1000 డాలర్లు వసూలు చేస్తే, తమకు రూ. 5 వేల వరకూ అందేదని పోలీసు విచారణలో అతను తెలిపాడు. ముంబైతో పాటు అహ్మదాబాద్ లో సైతం షగ్గీ కాల్ సెంటర్లు నడిపాడని గుర్తించిన పోలీసులు, ఇప్పుడతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపు 700 మంది వివిధ షిఫ్టుల్లో ఈ సెంటర్లలో పనిచేస్తుండగా, ఒక్కొక్కరికి జీతంగా రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకూ అతను ఇచ్చాడు. రాత్రి 7 నుంచి తెల్లవారుఝామున 4 వరకూ ఉన్న షిఫ్ట్ కీలకం కావడంతో, ఆ షిఫ్టులో ముఖ్యమైన వారిని నియమించేవాడు. రోజుకు 50 నుంచి 80 కాల్స్ చేస్తే, వాటిల్లో 3 నుంచి 5 వరకూ డీల్స్ వరకూ వెళ్లేవని జిగ్నేష్ వివరించాడు. దాదాపు ఏడాదిగా జరుగుతున్న ఈ స్కామ్ లో ఇప్పటివరకూ 70 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News