: ఢిల్లీ, ముంబైకి విమాన సర్వీసులు నిలిపివేసిన పాక్ ఎయిర్‌లైన్స్.. ఉరీ ఘటనే కారణం!
ఢిల్లీ, ముంబై నగరాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తూ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పీఐఏ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరాచీ నుంచి ఢిల్లీ, ముంబై నగరాల మధ్య నడిచే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఉరీ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య రాకపోకలు పూర్తిగా దెబ్బతినడం, అనుకున్నంతగా ట్రాఫిక్ లేకపోవడంతో పీఐఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఖాళీగా విమానాలను నడిపి నష్టాలను మూటగట్టుకోవడం ఇష్టం లేక ఈ నిర్ణయానికి వచ్చింది. గత మూడు నాలుగు వారాలుగా కరాచీ-ఢిల్లీ, కరాచీ- ముంబై మధ్య ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఆ నగరాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు పీఐఏ అధికార ప్రతినిధి శనివారం తెలిపారు. అయితే లాహోర్-ఢిల్లీ మధ్య సర్వీసులు మాత్రం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ రూట్లలో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారిని ప్రత్యామ్నాయ విమానాల ద్వారా గమ్యస్థానం చేరుస్తామని తెలిపారు. ప్రస్తుతం భారత్ నుంచి పాకిస్థాన్‌కు ఎటువంటి విమాన సర్వీసులు లేవు. పీఐఏ మాత్రం రెండు దేశాల మధ్య సర్వీసులు కొనసాగిస్తోంది.