: నేడు 900వ క్రికెట్ మ్యాచ్... సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసినా లేక 4-1తో గెలిచినా ఇండియాదే అగ్రస్థానం
న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను ఘనంగా ముగించి ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్న భారత జట్టు, నేటి నుంచి ఐదు వన్డేల సిరీస్ ను ఆడనుంది. ఈ పోటీలనూ క్లీన్ స్వీప్ చేసినా, కనీసం నాలుగింటిలో గెలిచినా వన్డే ర్యాంకింగ్స్ లోనూ భారత జట్టు ఫస్ట్ ర్యాంకును అందుకుంటుంది. నేటి మధ్యాహ్నం 1:30 నుంచి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో, హిమాలయ పర్వతాల ముంగిట ఉన్న ధర్మశాలలో ఈ మ్యాచ్ సాగనుంది. ఇక్కడి పిచ్, చలి వాతావరణం పేస్ కు అనుకూలించనుండగా, న్యూజిలాండ్ జట్టు ఈ పరిస్థితులను ఉపయోగించుకుని బోణీ కొట్టాలన్న సంకల్పంతో ఉంది. ఈ మ్యాచ్ భారత జట్టు ఆడుతున్న 900వ మ్యాచ్ కావడంతో మనవాళ్లు కూడా దీన్ని గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. న్యూజిలాండ్ జట్టు వన్డే మ్యాచ్ ఆడి 8 నెలలు కాగా, త్వరలో చాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో ఆ జట్టు మేనేజ్ మెంట్ ప్రయోగాలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం న్యూజిలాండ్ బలం కాగా, టెస్టు జట్టు ఓటమి, ఆటగాళ్ల నిలకడ లేమి జట్టును ఆందోళనకు గురి చేస్తున్నాయి. టీమిండియాకు ధోనీ నాయకత్వంతో పాటు రోహిత్, రహానే, కోహ్లీలు రాణించడం కీలకం.