: మిరాకిల్! ప్రమాదంలో సరిగ్గా రెండు ముక్కలైన కారు.. అందరూ క్షేమం!
ఇది నిజంగా అద్భుతమే. ప్రమాదంలో కారు రెండు ముక్కలు కాగా అందులో ఉన్న వారు చిన్నపాటి గాయాలతో బయట పడడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలండ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. డస్టిన్ బ్రాండన్ శుక్రవారం రాత్రి ఫుల్‌గా మందుకొట్టి మెర్సిడెస్ బెంజ్ కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వేగంగా వెళ్తున్న బ్రాండన్ రాక్‌విల్లే సెంటర్ సమీపంలో ఓ మజ్దా మియాటా కారును బలంగా ఢీకొట్టాడు. దీంతో బెంజ్ కారు తిరగబడింది. మజ్దా కారు సరిగ్గా రెండు ముక్కలైంది. అయితే ఆశ్చర్యకరంగా బెంజ్‌లో ప్రయాణిస్తున్న బ్రాండన్, 25 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు స్వల్పగాయలతో కారు నుంచి బయట పడగా మజ్దా డ్రైవర్ కూడా చిన్నపాటి గాయంతో బయటపడ్డాడు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్రాండెన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కారు రెండు ముక్కలయ్యేంత ఘోర ప్రమాదం జరిగినా అందరూ స్వల్ప గాయాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.