: హిందువులకు అభిమానిని, మోదీ చక్కగా పనిచేస్తున్నారు: భారతీయులపై ట్రంప్ పొగడ్తలు
అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకుంటే, భారత్, అమెరికాలు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాయని రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ హిందూ కూటమి ఏర్పాటు చేసిన ఇండియన్ - అమెరికన్స్ చారిటీ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. భారత్ అత్యంత వ్యూహాత్మకమైన భాగస్వామని అభివర్ణించిన ట్రంప్, ఇరు దేశాలకూ అద్భుత భవిష్యత్ ఉందని అన్నారు. తన చేతులకు పరిపాలన బాధ్యతలు వస్తే, ఇరు దేశాలూ మరింత దగ్గరవుతాయని అన్నారు. ఇండియాలో ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. భారత నేతలు చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారని అన్నారు. తాను హిందువులకు, ఇండియాకు అభిమానినని చెప్పుకున్న ట్రంప్, మోదీపై తనకెంతో నమ్మకం ఉందని అన్నారు. 19 నెలల క్రితం తాను ఇండియాకు వెళ్లానని, ఇకపై కూడా ఎన్నో మార్లు వెళ్లాలని ఉందని అన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ చేస్తున్న కృషికి అభినందనలు తెలుపుతూ, ముంబై దాడులను ట్రంప్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5 వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు.