: కోర్టుకెళ్తున్న గ్యాంగ్ రేప్ బాధితురాలని అడ్డగించి, కాల్పులు జరిపిన రేపిస్టులు.. ఉత్తరప్రదేశ్‌లో దారుణం
కోర్టుకు వెళ్తున్న అత్యాచార బాధితురాలని అడ్డుకున్న నిందితులు ఆమెను కసిదీరా కాల్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షామ్లి గ్రామంలో నివాసముండే ఓ మహిళపై ఈ ఏడాది జనవరిలో నలుగురు వ్యక్తులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో వారు కోర్టుకు వెళ్లారు. దీంతో నెల రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు కోర్టుకు వెళ్లడంతో ఆగ్రహించిన నిందితులు ఆమెను చంపేస్తామని బెదిరించసాగారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కలిసి వేడుకుంది. అంతలోనే ఆమెపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. శుక్రవారం ఆమె ముజఫర్‌నగర్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు సోదరుడితో కలిసి వెళ్తుండగా మోటారు సైకిళ్లపై వచ్చిన ఆరుగురు దుండగులు వారిని అడ్డగించారు. అతి దగ్గరి నుంచి ఆమెపై కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దానికి సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారు తలదాచుకునే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.