: నేను కష్టపడుతుంటే మీరు పడుకుంటారా?.. వంట కూడా నన్నే చేయమనేలా ఉన్నారు: చంద్రబాబు చమత్కారం
అన్నీ తానే చేస్తే మీరేం చేస్తారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల కోసం తాను 24 గంటలూ కష్టపడుతుంటే మీరు ఇళ్లలో పడుకుంటానంటే కుదరదని తేల్చి చెప్పారు. రేషన్ దుకాణాల్లో పామాయిల్, కందిపప్పు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తిని ఉద్దేశించి చంద్రబాబు ఈ వాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ గూడవల్లి సీతారామస్వామి ఏర్పాటు చేసిన నందమూరి తారకరామారావు విగ్రహాన్ని చంద్రబాబు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా నిలిపేందుకు తాను నిరంతరం కష్టపడుతున్నానని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కల్పించుకుని తమకు రేషన్ షాపుల్లో పామాయిల్, కందిపప్పు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్నీ తానే చేస్తే మీరేం చేస్తారని ప్రశ్నించారు. జనం తీరు చూస్తుంటే చివరికి వంట కూడా తననే చేయమనేలా ఉన్నారంటూ నవ్వులు పూయించారు. విభజన తీరు వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని తెలిపారు.