: 23న ఒకే రోజు నాలుగు పోటీ పరీక్షలు.. వాయిదా వేయాలని అభ్యర్థుల వేడుకోలు


ఈనెల 23వ తేదీన ఒకే రోజు నాలుగు పోటీ పరీక్షలు జరగనుండడంతో వేలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ పరీక్షకు హాజరుకావాలో తెలియక తికమకపడుతున్నారు. దీంతో పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈనెల 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలోని పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష జరగనుండగా అదే రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష జరగనుంది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్(సీడీఎస్) పరీక్ష ఉదయం 9-12ల మధ్య జరగనుంది. ఐబీపీఎస్ పీవో, ఎంటీ రాత పరీక్ష కూడా అదే రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు జరగనుంది. ఒకే రోజు ఇన్ని పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు పరీక్షలకు హాజరు కావాలనుకుని హాల్‌టికెట్లు పొందిన వారు ఏ పరీక్షకు హాజరు కావాలో తెలియక సతమతమవుతున్నారు. కానిస్టేబుల్ రాత పరీక్షను ప్రభుత్వం వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News