: ఈ దుస్తులు ధరిస్తే ఒంట్లో వేడి తగ్గుతుంది!
ఏసీలు లేకుండా మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఎలా? అందుకు ఎలాంటి ఉపకరణాలు ఉపయోగపడతాయి? అనే ఆలోచనతో కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త వస్త్రాలు రూపొందించారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్లాస్టిక్ ఆధారిత వస్త్రాన్ని ఈ శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీనితో తయారు చేసే దుస్తులు ధరిస్తే శరీర ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెల్సియస్ తగ్గుతుందని వారు చెబుతున్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ ఈ కీ ‘సైన్స్’ పత్రికకు వివరిస్తూ...ఇన్ ఫ్రారెడ్ (పరారుణ) కిరణాల వల్ల మానవ శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని తెలిపారు. ఆ కిరణాలు సోకకుండా తాము తయారు చేసిన వస్త్రం అడ్డుకుంటుందని ఆయన వెల్లడించారు. ఇంతవరకు ఈ కిరణాలను అడ్డుకునే దుస్తులు తయారుచేసే దిశగా పరిశోధనలు సాగలేదని ఆయన తెలిపారు. వాస్తవానికి మానవులు ఏ రకమైన దుస్తులు ధరించినా శరీరంలో ఎంతో కొంత వేడి పుడుతుందని, చల్లగా ఉంచే దుస్తులు తయారు చేస్తే పలు ప్రయోజనాలు ఉంటాయనే ఉద్దేశంతో తాము ఈ ప్లాస్టిక్ తో కూడిన కొత్త వస్త్రాన్ని తయారు చేశామని ఆయన తెలిపారు. ఇందులో ప్లాస్టిక్ శాతం తగ్గించి సాధారణ వస్త్రాలకు దగ్గరిగా ఉండేలా దీనిని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. వీటిని వివిధ రంగుల్లో ప్రజలు దుస్తులుగా వినియోగించేలా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వారు తెలిపారు. ఇలాంటి దుస్తుల వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఇంట్లో ఏసీ, ఫ్యాన్ల అవసరం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.