: యువీ-గంభీర్ ల మధ్య సరదా ట్వీటులు!
టీమిండియాలో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, ఓపెనర్ గౌతమ్ గంభీర్ వి విభిన్నమైన మనస్తత్వాలు. యువీ సరదాగా ఉంటూ చెలరేగుతాడు. గంభీర్ అలా కాదు గంభీరంగా ఉంటూ, ఎప్పుడు పేలిపోదామా? అని ఎదురుచూసే డైనమేట్ లా ఉంటాడు. వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో చోటుచేసుకుని, అభిమానుల ముఖాల్లో నవ్వులు పూయించింది. గౌతమ్ గంభీర్ నిన్న తన 35వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. దీనిని పురస్కరించుకుని యువరాజ్ సింగ్ ‘‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు మిస్టర్ గౌతమ్ గంభీర్.. వికెట్ల మధ్యన నవ్వు ముఖంతో నువ్వు పరిగెత్తాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానమిచ్చిన గౌతీ ‘యువీస్ట్రాంగ్ సోదరా ధన్యవాదాలు. రోజులు దగ్గర పడుతున్నాయికదా...నువ్వు కూడా సిద్ధమవ్వు... పెళ్లికాగానే వంట గది, పడక గది మధ్యన వేగంగా పరుగెత్తడానికి’ అంటూ చమత్కరించాడు. ఈ సంభాషణ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. కాగా, యువీ బాలీవుడ్ నటీ, మోడల్ హజెల్ కీచ్ ను త్వరలో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే.