: రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ బాలీవుడ్ నటి కంగనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడింది. హన్సల్ మోహతా దర్శకత్వంలో రూపొందుతున్న 'సిమ్రాన్' సినిమా షూటింగ్ అమెరికాలోని జార్జియాలో జరుగుతోంది. షూటింగ్ ముగిసిన అనంతరం శివారుల నుంచి అట్లాంటా హోటల్ కు వెళ్లేందుకు ఆమె కారులో బయలుదేరింది. ఆమె కారును స్థానిక డ్రైవర్ హైవే 381పై ట్రాఫిక్ ను పట్టించుకోకుండా వేగంగా నడిపాడు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన దగ్గుతో అస్వస్థతకు గురయ్యాడు. అయినా వేగం తగ్గించకపోవడంతో స్టీరింగ్ పై తలవాల్చి స్పృహ కోల్పోయే స్థితికి వెళ్లాడు. దీనిని గమనించిన కంగనా బాడీగార్డు స్పందించినా అప్పటికే లేటైంది. దీంతో హైవే లైన్స్ ను దాటి, సమీపంలోని ఐరన్ ఫెన్సింగ్ ను ఆ కారు ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని, కంగనాతోపాటు షూటింగ్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. నుదురు, చేతులపై గాయాలతోనే కంగనా షూటింగ్ లో పాల్గొనడం విశేషం.