: రూ.39,000 కోట్లతో అత్యంత అధునాతనమైన విమాన విధ్వంసకర రక్షణ వ్యవస్థకు రష్యాతో భారత్ ఒప్పందం
గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో రక్షణ రంగంలో భారత్ ప్రధానంగా ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్ డీల్‌లో భాగంగా రూ.39,000 కోట్ల రూపాయలతో ఓ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అత్యంత అధునాతనమైన విమాన విధ్వంసక రక్షణ వ్యవస్థ (యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్) 'ఎస్- 400 ట్రియంఫ్' సేకరణకు ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. ఆ దేశం నుంచి ఎస్-400 ట్రియంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందనుందని భారత అధికారులు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో సుదూర లక్ష్యాలను ఛేదించవచ్చు. ఇది భారత్ తీసుకున్న కీలక నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ వైపు చైనా, మరోవైపు పాకిస్థాన్‌తో సరిహద్దుల వెంబడి రక్షణను క్షేత్రస్థాయిలో బలపర్చేందుకు ఇటువంటి క్షిపణులు ఉపయోగపడతాయని మిలటరీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్షిపణని గగనతలం నుంచి ప్రయోగిస్తారని చెప్పారు. శత్రు దేశ యుద్ధ విమానాలు, క్షిపణులు, 400 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్‌లను సైతం ఈ క్షిపణి పూర్తిగా ధ్వంసం చేయగలదని చెప్పారు. ఏకకాలంలో 36 లక్ష్యాలను ఛేదించగలితే సామర్థ్యం దీనికి ఉంది. మొత్తం ఇటువంటి ఐదు క్షిపణుల దిగుమతి కోసం భారత్ సంవత్సర కాలంగా చర్చలు జరుపుతోంది. ఈ డీల్ మాత్రమే కాకుండా ఈ రోజు నాలుగు అడ్మిరల్ గ్రిగోరోవిచ్-క్లాస్ (ప్రాజెక్ట్ 11356) గైడెడ్-మిసైల్ స్టీల్త్ ఫ్రిగేట్స్‌కు సంబంధించి మరో కీలక ఒప్పందం కూడా రష్యాతో భారత్ చేసుకుంది. ఈడీల్ తో కామ్‌కోవ్ హెలికాప్టర్ల తయారీని భారత్, రష్యా సంయుక్తంగా చేపట్టనుంది.