: నాన్నా! చదవలేకపోతున్నాను...క్షమించండి...ఛోటూ, నువ్వే నాన్న ఆకాంక్షలు నెరవేర్చాలి: ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి వీడియో సందేశం
తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలు, కోరికలకు విద్యార్థులు ఎలా బలైపోతున్నారన్నదానికి సాక్ష్యంగా నిలిచిన దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కోటాలో చోటుచేసుకుంది. దేశంలోని పోటీ పరీక్షలకు కోటా ప్రధాన కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను అక్కడికి కోచింగ్ కు పంపుతున్నారు. అలాగే బీహార్ లోని రాధోపూర్ కు చెందిన అమన్ గుప్తా (16) ఓ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ 'నీట్' కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే రెండింటి ఒత్తిడి భరించలేకపోయిన అమన్ గుప్తా తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. నేటి ఉదయం 9 గంటలకు బయటకు బయలుదేరిన అమన్, ఆ తర్వాత స్నేహితులకు ఫోన్ చేసి తన నిర్ణయం చెప్పాడు. దీంతో షాక్ కు గురైన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారమందించి, సంఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే సెల్ ఫోన్ లో 11:14 నిమిషాల నిడివిగల వీడియోలో తన భావోద్వేగాలు నిక్షిప్తం చేసి చంబల్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమన్ గుప్తా తన వీడియోలో ఏం చెప్పాడంటే...'నాన్న చెప్పింది కరెక్టే. నేను చదువుల్లో ఎప్పుడూ రాణించలేను. నాన్నా, మీరు నాకెప్పుడూ మద్దతిచ్చారు. కానీ నేనే మీరు సిగ్గుపడేలా చేశాను. పదో తరగతిలోనూ నాపై ప్రిన్స్‌పాల్ కు ఫిర్యాదు అందింది. నేను జీవితంలో ఏమీ చేయలేకపోతున్నాను. కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లో నా స్నేహితులు, ప్రతి ఒక్కరు నాకు సాయపడ్డారు. అయినా నేను సరిగ్గా చేయలేకపోతున్నా. నా కోసం ఎవరూ ఏడవవొద్దు. ఏ కారణం లేకున్నా ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు బతకాలని లేదు. ఛోటు (తమ్ముడు) నువ్వు బాగా కష్టపడి అమ్మానాన్నల ఆకాంక్షలు నెరవేర్చు' అని పేర్కొన్నాడు. అమన్ చాలా తెలివైన విద్యార్థి అని, పరీక్షల్లో 80 శాతానికిపైగా మార్కులు తెచ్చుకునేవాడని కోచింగ్ ఇన్ స్టిట్యూట్ అధ్యాపకులు చెబుతున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడిని పిల్లలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడడం అందర్నీ కలచివేస్తోంది. కోటాలో ఇలాంటి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దీంతో పిల్లలకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కల్పించడం ద్వారా ఇలాంటి దారుణాలు అరికట్టవచ్చని, తల్లిదండ్రులు తమ కోరికలు పిల్లలపై రుద్దడం తగ్గించాలని పలువురు సూచిస్తున్నారు.