: ఆక్వాఫుడ్ పరిశ్రమపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నేను రంగంలోకి దిగుతా!: పవన్ కల్యాణ్
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వాఫుడ్ ప్రాజెక్టుపై ప్రతి రోజూ ఎవరో ఒకరు వచ్చి తనను కలుస్తున్నారని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మికత పేరుతో ప్రపంచం మెచ్చేలా ప్రభుత్వం పుష్కరాలు జరిపిందని, అలాంటి పుష్కరాలకు ప్రతిబంధకంగా మారుతూ, నదిని కలుషితం చేయబోయే పరిశ్రమను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోందని ఆయన అడిగారు. నదీపాయల్లోకి ఎన్నో పరిశ్రమలు కాలుష్యం వదులుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఎక్కడైనా పరిశ్రమలు పెడుతున్నప్పుడు ఆ భూములు పంటలకు అనువుగా లేని భూమి అని నిరూపించాల్సి ఉంటుందని, అయితే ఏ పరిశ్రమా ఆ నిబంధనలు పాటిస్తున్నట్టు కనిపించదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఫుడ్ పార్క్ పెట్టే వారు అక్రమానికి పాల్పడరని గ్యారెంటీ ఏంటని ఆయన అడిగారు. ప్రశాంతతకు నెలవైన చిన్న ఊర్లో 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందో తనకు అర్ధం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'సీపీఎం మధు వంటి నేతలు వెళ్లినప్పుడు వారిని నిర్బంధించారు. అది సరైన పద్దతేనా?' అని ఆయన నిలదీశారు. ఈ ఫుడ్ పార్క్ విషయంలో ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే.. పశ్చిమ బెంగాల్ లో జరిగిన నందిగ్రామ్ ఘటన ఏపీలో పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వాస్తవానికి తాను అక్కడికే వెళ్దామనుకున్నానని, అయితే తాను వెళ్తే ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని భావించి వెళ్లలేదని ఆయన చెప్పారు. ఇలాంటి సమస్య ఆస్ట్రేలియాలో వస్తే అక్కడ కేవలం కాలుష్య సమస్యగా మారిందని, కానీ మన దేశంలో ఇలాంటి సమస్య కుల పోరాటంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలు వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆక్వాఫుడ్ ప్రాజెక్టును సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లండి అని అడుగుతున్నారు. అలా చేయడం వల్ల ఇబ్బంది ఉంటే ఓ కమిటీని వేసి, ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండని ఆయన సూచించారు. ఆ గ్రామాల ప్రజలకు న్యాయం చేయండి అని ముఖ్యమంత్రికి సూచించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పశ్చిమగోదావరి జిల్లా అన్నది గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ప్రధాని మోదీ గంగా ప్రక్షాళన అంటుంటే...ఇక్కడి బీజేపీ నేతలు గోదావరి కాలుష్యానికి పాల్పడడం సరికాదని ఆయన తెలిపారు. ప్రభుత్వం మొండివైఖరి అనుసరిస్తే.. ప్రజల పక్షాన నిలబడతానని ఆయన స్పష్టం చేశారు.