: రిలయన్స్ జియో సిమ్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నారా?.. అయితే జాగ్రత్తపడక తప్పదని హెచ్చరిస్తోన్న నిపుణులు

ఎన్నో ఆఫర్లు గుప్పిస్తూ వినియోగదారుల ముందుకు వచ్చిన రిలయన్స్ సిమ్ కార్డులను ఎంతో మంది ఆన్‌లైన్ ద్వారా కొనాలని యోచిస్తున్నారు. అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్, వీడియోకాల్స్, ఇంటర్నెట్ డేటా, ఎస్‌ఎంఎస్‌లు వంటి ఎన్నో ఆఫర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, వాటిని ఆన్‌లైన్‌లో కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ సిమ్ కొనుగోలు చేయాలంటే సదరు కంపెనీ అందులో ఉంచిన దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో కొనుగోలుదారుడు తన పేరు, చిరునామా, ప్రస్తుత ఫోన్ నెంబరు, ఈ మెయిల్ ఐడీ పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే, దరఖాస్తు చేసిన పదిరోజుల్లోపు కేవలం రూ.199ల డెలివరీ ఫీజుతో సిమ్‌కార్డును కొనుగోలుదారు పొందుపరిచి అడ్రస్సుకు తెచ్చిస్తామని పలు వెబ్‌సైట్లు ప్రకటిస్తున్నాయి. జియో సిమ్ మాత్రమే కాకుండా రూ.1,999కే రిలయన్స్ జియో డోంగిల్, రూ.2,199కే రిలయన్స్ వైఫై డోంగిల్‌లను వెబ్‌సైట్లు అందిస్తున్నాయి. అయితే, కొనుగోలుదారులు ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రిలయన్స్ సంస్థ ఎటువంటి ఆన్‌లైన్, హోం డెలివరీ సర్వీసులను ప్రకటించలేదు. కొన్ని నకిలీ వెబ్‌సైట్లు ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాయి. సోషల్‌మీడియా, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ప్రచారం చేసుకుంటూ ఈ అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. జియో సిమ్ డెలివరీ సమయంలో వెబ్‌సైట్లు వినియోగదారుడి అడ్రస్ వంటి పూర్తి వివరాలు సేకరిస్తున్నాయి. వివరాలన్నీ నకిలీ వెబ్‌సైట్లకు చెప్పేస్తే మీకు వాటి నిర్వాహకుల నుంచి ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాబట్టి అటువంటి వెబ్‌సైట్లకు వినియోగదారులు దూరంగా ఉండడమే మంచిదని నిపుణుల అభిప్రాయం.