: పవన్ కల్యాణే మాకు దిక్కని వచ్చాం!: పశ్చిమ గోదావారి జిల్లా రైతులు


తమ ప్రాంతంలో ఆక్వా ఫుడ్ పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా నిరసిస్తూ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన పలువురు రైతులు ఈ రోజు ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుంతేరు కాలువపై ఆధారపడి 2 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని అన్నారు. ఆక్వాఫుడ్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని వారు ఆరోపించారు. రైతుల సంతకాల ఫోర్జరీ చేసి, పరిశ్రమకు గ్రామీణులు అనుకూలమని ప్రభుత్వం ప్రకటించిందని వారు విమర్శించారు. ఆ తరువాత తాము అభ్యంతరం చెప్పడంతో యువకులపై పెద్దపెద్ద సెక్షన్లతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, రైతులు అన్ని పార్టీల నేతల వద్దకు తిరిగినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫుడ్ పరిశ్రమ వల్ల కుంతేరు కాల్వ విషతుల్యమైపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తమకు అండగా నిలబడతారన్న ఆశతో వచ్చామని వారు తెలిపారు. బహిర్భూమికి వెళ్లే వ్యక్తి దగ్గర ఆధార్ కార్డు లేకపోతే అరెస్టు చేసే పరిస్థితులు తమ గ్రామాలలో నెలకొన్నాయని రైతులు పేర్కొన్నారు. ఆక్వాఫుడ్ పరిశ్రమ ద్వారా రోజూ 2 లక్షల వ్యర్థాలు కుంతేరు కాల్వలో కలుస్తాయని, దీన్ని వ్యతిరేకిస్తూ తాము ఆందోళన చేస్తున్నామని, తమ ఆందోళనలను లెక్కచేయకుండా 144 సెక్షన్ ను అమలు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామంలోని రైతులు, మత్స్యకారులు, మహిళలు, విద్యార్థులు, పిల్లలు అని తేడా లేకుండా ఒక్కొక్కరిపై ఏడు కేసులు చొప్పున ఉన్నాయని ఆ గ్రామానికి చెందిన రైతులు, విశ్వమానవ వేదిక ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News