: రేపటి నుంచి వన్డే పోరు.. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా.. అనుభవమే అండగా కివీస్!
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రేపటి నుంచి ధర్మశాలలో వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమిండియా నైతికంగా బలంగా ఉంది. అయితే టెస్టు జట్టే వన్డే సిరీస్ లో లేదు. మెజారిటీ సభ్యులున్నప్పటికీ బౌలింగ్ సమీకరణాలు, వ్యూహాలు మారిపోయాయి. దీంతో టీమిండియా వన్డే సిరీస్ లో ఎలాంటి ప్రదర్శన చేయనుందనే ఆసక్తి అందర్లోనూ నెలకొనగా, క్లీన్ స్వీప్ అవమాన భారాన్ని తొలగించుకోవడమే లక్ష్యంగా కివీస్ బరిలోకి దిగనుంది. వన్డే సిరీస్ లో విజయం సాధించి సత్తాచాటాలని న్యూజిలాండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. పిచ్ తో సవాళ్లు ఎదురైనప్పటికీ ఐపీఎల్ లో ఆడిన అనుభవం వారికి కలిసివచ్చే అవకాశం ఉంది. అదీకాక వన్డేలకు విభిన్నమైన పిచ్ లు ఎదుర్కోనుండడం కూడా వారికి కొంత సానుకూలాంశం. రెండు జట్లు తమ ర్యాంకులను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి. న్యూజిలాండ్ వన్డేల్లో మూడో ర్యాంకులో ఉండగా, టీమిండియా నాలుగో ర్యాంకులో ఉంది. ఈ సిరీస్ ను సాధించడం ద్వారా టీమిండియా మూడో ర్యాంకుపై కన్నేయగా, కివీస్ తన ర్యాంకుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, రెండో ర్యాంకుకు దగ్గర కావడంపై కన్నేసింది. దీంతో వన్డే సిరీస్ ఆసక్తికరంగా జరగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.