: ఓ స్టూడియో అధినేత నన్ను రేప్ చేశాడు: హాలీవుడ్ హీరోయిన్ రోజ్
ఓ స్టూడియో అధినేత తనను రేప్ చేశాడని ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ రోజ్ మెక్ గోవాన్ ఆరోపించింది. చార్మ్ డ్, గ్రిండ్ హౌస్ లాంటి సినిమాలతో 42 ఏళ్ల ఈ భామ బాగా పాప్యులర్ అయింది. తమపై డొనాల్డ్ ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొందరు, శరీర భాగాలపై చేయి వేశాడంటూ ఇంకొందరు, బలవంతంగా పెదవులపై ముద్దు పెట్టుకున్నాడంటూ మరికొందరు మహిళలు ఇప్పటికే ఆరోపించారు. ఈ క్రమంలోనే, మహిళలపై పురుషుల అమానుష ప్రవర్తనపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో, రోజ్ కూడా గతంలో తనపై జరిగిన లైంగిక దాడిని ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. ఒక సినిమాలో సెక్స్ సీన్ లో పాల్గొన్నాను కాబట్టి, స్టూడియో అధినేతపై కేసు గెలిచే అవకాశం లేదని ఒక మహిళా అటార్నీ తనతో చెప్పడంతో, అతనిపై కేసు వేసే ఆలోచనను విరమించుకున్నానని తొలి ట్వీట్ లో తెలిపింది. రేప్ జరిగిన తర్వాత తనను రేప్ చేసిన వ్యక్తిని గొప్పగా పొగుడుతూ, తనను మాత్రం మీడియా అవమానించిందని రెండో ట్వీట్ లో పేర్కొంది. తన మాజీ భాగస్వామి తమ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తనను రేప్ చేసిన వ్యక్తికే అమ్మేశాడని మూడో ట్వీట్ లో తెలిపింది. తనను రేప్ చేశాడని చెప్పిన రోజ్... రేప్ ఎవరు చేశారన్న విషయాన్ని మాత్రం బయటపెట్టక పోవడం గమనార్హం.