: జయలలిత ఆరోగ్య స్థితిపై కరుణానిధి అనుమానాలు ఇప్పుడు తీరుతాయేమో!
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె అనారోగ్యంపై మాజీ ముఖ్యమంత్రి కరుణానిది పలు సందర్భాల్లో అనుమానం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు స్టాలిన్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చినా ఆయనలోని సందేహాలు నివృత్తికాలేదు. దీంతో ఆమె ఫోటోలు లేదా వీడియోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా శాఖల బదిలీ ఫైలుపై జయలలితే సంతకం చేశారా? అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య రాజాతి అమ్మాళ్ అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలితను పరామర్శించారు. వైద్యులనడిగి ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం శశికళను కలిసి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. దీనిని డీఎంకే వర్గాలు ధ్రువీకరించాయి. దీంతో అయన సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది.