: జగన్ ఓ బ్యాటరీ లేని ఫోన్... శిఖండిలా రోజాను వదులుతున్నారు: బుద్దా వెంకన్న
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బ్యాటరీ లేని సెల్ ఫోన్ వంటివాడు జగన్ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఆయనను ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటే... ఆయన మాత్రం ఏపీలో ఉండకుండా హైదరాబాద్, బెంగళూరుల్లోనే గడుపుతున్నారనంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి కష్టపడి పని చేస్తూ ఉంటే... జగన్ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు. ధర్నాల కోసం ఉదయం రావడం, సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోవడం... జగన్ జీవితం ఇలా గడుస్తోందంటూ విమర్శించారు. ఎన్నికలకు 6 నెలల ముందు ఏపీకి వస్తే చాలని జగన్ భావిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపైకి ఎమ్మెల్యే రోజాను ఓ శిఖండిలా జగన్ వదులుతున్నారని బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో రోజా ఒక పెయిడ్ వర్కర్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో పెయిడ్ వర్కర్ లా ఎలా పని చేస్తోందో... వైసీపీలో కూడా అలానే పెయిడ్ వర్కర్ లా పని చేస్తోందంటూ వ్యాఖ్యానించారు.